
--> Transcreated from the phrase in a Punjabi folk song, “Laung Gawacha” <--
|| పల్లవి ||
సందేళ ను ఇంటికొచ్చే దోవలో
సందేళ ను ఇంటికొచ్చే దోవలో
నా అడుగుల్లో సూత్తా రారా నా ముక్కుపుడక,
పారేసుకున్నా మావాఁ నా ముక్కుపుడక..
|| అను పల్లవి ||
సద్దిచ్చి పోతుంటే మావఁ దోవలో ,
నీకు సద్దిచ్చి పోతుంటే మావఁ దోవలో
ఆరె అరెరె ఆరె అరెరె
పారేసుకున్నా మావాఁ నా ముక్కుపుడక
నిఘాబెట్టి సూత్తా రారా నా ముక్కుపుడక..
|| చరణం. 1 ||
ముక్కుపుడక ఎక్కడాని అత్త ఆరా తీసేననుకో ,
నేనేమి సెప్పి తప్పుకుందురో మావాఁ
అయ్యో రామా !
ఊసులెన్నో నీకు నేను మోసుకొచ్చె మోజులోన ,
సూసుకోలేదయ్య మావఁ యాడ జారిపోయెనో !
హా నా ముక్కుపుడక ..
నిఘాబెట్టి సూసి తేరో నా ముక్కుపుడక ..
|| సద్దిచ్చి ||
|| చరణం. 2 ||
ఎంత వయ్యారామాని నీ సెల్లి దెప్పుతూనే ఉండే ,
జాగరత్తగెళ్లమాని మరిది సెప్పుతూనే ఉండే,
హయ్యో సెపుతూనే ఉండే
పచ్చాని పైళ్లు సూత్త తుళ్లుకుంటూ వత్తుంటే,
ఒళ్ళుపయి తెలీక నాకు కళ్ళు కానరాలే రో!
హా నా ముక్కుపుడక
నిఘాబెట్టి సూసి తేరో నా ముక్కుపుడక ..
|| సందేళ ||
|| చరణం. 3 ||
పులుసు నీకు ఇష్టమాని మురిసిపోతా సేస్తిరో,
ముసిముసిగా నవ్వుతా సోకు సేసుకుంటిరో,
నే సోకు సేసుకుంటిరో
బువ్వతినే యేళ నిన్ను కవ్వించి రావాలని,
సిలిపి ఊహ తట్టి నాకీ యావ యేల పుట్టెనో !
హా నా ముక్కుపుడక
నిఘాబెట్టి సూసి తేరో నా ముక్కుపుడక ..
|| సద్దిచ్చి ||
|| చరణం. 4 ||
అమ్మ అయ్యలాంటి అత్తా మామలున్న ఇంట ,
నా జంట నువ్వుండ కంట నీరు పెట్టలే,
నే కంట నీరు పెట్టలే..
సంటి పిల్లోలె సూస్కునే నన్నేమంటారో అని,
ఇంటికెళ్ళక పొలిమేరనే ఉంటిరో..
నా ముక్కుపుడక
మన్నించరా నను మావాఁ నా ముక్కుపుడక ..
|| సందేళ ||
-+-~-~-~-+-
-------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి