రాసింది ప్రతీది కవితవ్వదు,
ప్రతి పసి భావం కవిత గా మారదు
ప్రతి రాతా పులకింతల నివ్వదు
ఈ అర్థరాత్రికి,
ఆ రాతకి -- మా నిద్రకి మధ్య
ఈ రాత్రి నిద్రకి
మా దరిద్రానికి -- మా ప్రారబ్దానికి మధ్య
.
.
అసలు కవిత కాదిది, చెవి నొప్పి,
గోడమీద బల్లి ఇపుడె పాకే
అని అతకని అవకతవకే ఇది!
భావుకత కాదిది,
ఎలాగ చదివినా,
నిలువుగా చీల్చినా,
కవిత మాత్రం కానే కాదిది!
అడ్మినుండగానే రసార్ద్ర హృదయాల్ని,
పల్లికిలించి వెక్కిరించిన రాత ఇది!
ఆవులింతల్లో జనాల్ని
అర్ధరాత్రి ఝాడించిన రాత అది!
వాసన! ఇదెక్కడి నుండి అని
సందిగ్ధంలో పడేసిన వాతమిది!
నే చదివిన కవితలను ఎగరగొట్టెట్టుగా,
నా రసజ్ఞత నీ స్పందించకుండా చేసి,
నా మెదడుకె వణుకు పుట్టించిన రాత అది!
నా పెన్ను నుండి, నా ఇంకు, బయటికొచ్చి కక్కి,
నా పుస్తకాల నే పాడు చేసిన క్షుద్రమిది!
.
.
"భావమన్నది కవితకు కావాలి కాని,
నాకు అక్కర్లేదని,
నాకొచ్చిన కొన్ని పదాల్ని,
ఈ గుంపులో పోసి, విదిల్చి, గతకడం కోసం,
నే పడే ఆరాటాన్ని, నేను చేసే పోరాటాన్ని,
మీకో ముళ్ళ కిరీటం చేసే చేత ఇది!" అన్నట్టే ఉందిది.
.
.
ఇది ఎన్నటికీ అసలు ఏ విధంగానూ కవిత మాత్రం కాదు,
ఏంటిది మాకేంటిది,
పుస్తకాల కోసం ఇక్కడ గుమి కూడితే,
అర్ధరాత్రి వేళ మాకేంటిది,
మేమంతా తలో చేయి వేసి,
భావ దారిద్య్రంలో మునిగిన మిమ్ములను,
లాగితే బైటికి, ముంచితే దేనిలో,
కవిత తాలూకా రహస్యం మీకేమి అమరుతుంది?
ఔచిత్యం, భావుకం,
చిక్కటి నుడి,
చక్కని శైలి,
చెక్కని శిల్పం,
లాంటి లక్షణాలు,
నవరసాలతో పాటు, ఆర్ద్రత, లాంటి అనేక భావాలుండాలి కానీ,
కాసిన్ని పదాలు, అస్పష్ట భావాల అవకతవకలు,
ఇలా కెలికేకొద్ది వచ్చే అనుభవాలు ఉంటే కవితలు కావు, అలా ఎన్నటికీ రావు..
.
.
"మాటలు పేర్చడం కవితకాదు మంత్రం తంత్రం అసలేకాదు, అంత్యప్రాసలు వేసినంత మాత్రాన ప్రోసైక్ భావం పోయెట్రీ అవదు" అని తిలక్ తల్లడిల్లాడే, పిల్లాడిని నేనేమి చెప్పను మీకు?!
.
.
అన్నా! పలు పుస్తకాలు, పాఠకుల అభిప్రాయాలు, వారి అనుభవాలు, స్పందనలు పంచుకునే వేదిక మీదకి, మళ్లీ ఇలా కవితలంటూ మోసుకు రాకు.
🙏
"మీకేమైంది వారేదో ప్రయత్నిస్తే??"
అనబోయే దయాలువులైన జనానికి-
.
.
ఇటువంటి సులువైన వచనాన్ని,
ఈ అస్త్యవ్యస్త పదాల పచనాన్ని,
మనం ఆవురావురు మంటూ తింటే,
మన తెనుగు కవితా పుష్టికే వాంతి అవుతుంది,
ఇదే భావుకత ఏమో అనే భ్రాంతి మొదలవుతుంది,
మన రసజ్ఞతే పలుచనైపోతుంది,
కవన విలక్షణమే మరుగైపోతుంది,
మన తెనుగు కవితే చులకనైపోతుంది,
అదే చలామణి అయ్యే ప్రమాదముంది..
కాదంటారా,మళ్లీ మీరే ఆ కుకవితలనే ఓసారి చదువుకోండి,
మీకే అర్థమవుతుంది.
.
.
" you may contribute your verse " అని Walt Whitman పిలిస్తే,
" నేను సైతం, ప్రపంచాగ్నికి " అని ఎలుగెత్తి మోగిన ఘనత మన కవితది..
సోకు కోసం, మెప్పుల సాకు కోసం, రాకపోయినా వేళ్ళు జొనిపి చేసుకునే డోకు కాదు మన తెలుగు కవిత అని మనవి.
-rn
— - — — - — — - — — - — — - —
ఒక వాట్సప్ గ్రూప్ లో భావుకత అని భ్రమసి తెచ్చిపెట్టుకున్న భావ దారిద్య్రం తో ఏదో రాసుకుని, అది బాగుందనేసుకుని, ఇలా రాసుకున్నాడు ఒక కుర్రాడు:
ప్రతి రాత్రి నిద్రనివ్వదు
ప్రతి నిద్ర గాఢ నిద్ర గా మారదు
ప్రతి గాఢ నిద్ర కలలనివ్వదు
ఆ రోజు రాత్రి కి ,
ఆ రాత్రి కి -- నిద్ర కి మధ్య
ఆ రాత్రి నిద్రకి ,
ఆ నిద్రకి-- గాఢ నిద్ర కి మధ్య
గాఢ నిద్ర కాదది
సొయి తప్పి,
సోమ్మసోల్లినప్పుడు పోయె
గాఢ నిద్ర మాత్రం కానె కాదది......!
కల కాదది
ఎలాగ చూసిన,
ఏ విధంగా పోల్చిన
కల మాత్రం కానె కాదది .......!
బతికుండగానే మరణపు దృశ్యాల్ని
కళ్ళ ముందుంచిన నిద్ర అది................!
చావు తర్వాతి క్షణాల్ని
బతికుండగానే చూపించిన నిద్ర అది......!
శ్వాసిస్తున్నానో లేదో అన్న ధ్యాసనే
సందిగ్ధం లో పడేసిన నిద్ర అది ..............!
నా మదిలోని ఆలోచనలకు తగ్గట్టుగా
నా తనువు ని స్పందించకుండా చెసి
నా మస్తిష్కానికే వణుకు పుట్టించిన నిద్ర అది ..!
నా మెను(దెహం) నుండి
నా అంతరాత్మ ని బయటకి తీసుకొచ్చి
నాతోనే మాట్లాడించిన నిద్ర అది ..............!
చావన్నది నా తనువూకె గాని
నాకు కాదని,
చావు చివరి క్షణాల్ని
నా కళ్ళ ముందు మెదిల్చి
బతకడం కోసం
నేను పడె ఆరాటాన్ని ,నెను చెసే పోరాటాన్ని
నాకే చూపించిన నిద్ర అది ....................!
అది ముమ్మాటికీ మామూలు నిద్ర మాత్రం కాదది.
:(పేరు పెట్టట్లేదు)
ఇది చదివిన చిరాకులో, ఈ పత్యానికి పెరడీగా నేను రాసి, అదే గ్రూపులో పెట్టాను..
— - — — - — — - — — - — — - —
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి