
[కో+(ఇం)కో+(ము)క్కో]తి కొమ్మచ్చులనే ఆమ్రఫలత్రయాన్ని మరొక్క సారి కొరుక్కుతింటుంటే, 'కొ','కో' అనే జత గుణింతాలతో,
దిగంతాలు దాటినా తరగని పదఫలసంపద కలిగిన కొమ్మలున్న తెలుగు భాషా కల్పతరువునెక్కి నా మెదడుకోతి కోకొల్లలుగా ఆడిన
తైతక్కలు,కోలాటాలు,అచ్చులు+హల్లులు +పొల్లులు కలిపి ఆడిన కొమ్మచ్చులను కాగితపు దారానికి కలంతో గుదిగుచ్చగా వచ్చిన పిచ్చిరాతలు కాదు కాదు కోతలివి..
కొత్త పాళీ కొని నేను,
కొస దాకా సిరా పోసి,
కోమలాంగులను, కిలికించితాలను, మన తెనుగు-
కొమ్మలను, బాపు బొమ్మలను తలచి, నా
కోతి మెదడుకా కలాన్నిచ్చి
కొంటె పదాలను చేర్చి,
కోణంగి ఊసులన్నీ కూర్చి
కొరికేసేలా చూసే కళ్ళని గూర్చి
కొన్ని పంక్తులు పేర్చబోతే
కోపగించిన నా ఊహా-
కోమలి, భృకుటి ముడివేసి
కొర కొరా నను చూసినపుడు తన
కొన ముక్కు ఎరుపెక్కగా,
కోటి రెట్లైన సోకుని, ఆ కను-
-కొళుకుల పై సుడుల ముంగురులను
కొనియాడ నాకు నుడులు కరువైతే,
కోరుకోనా పలుకులమ్మను
కొత్త పదాలను నను పలకనిమ్మని..
కొలుచుకోనా ఆ మరులదేవుని, సూదంటు
కొసల ప్రణయ బాణాలైన
కోరికలను కృశించిన నా మనసునింకా
కోసుకు పోయేలా విడువరాదంటు..
కొలువుదీరిన పరువాలతో
కోడె వయసు మిస మిసలతో నను
కొంగున కట్టుకుపోగల మధురాంగనా
కొంత శాంతించి నీవు నన్నిలా
కోరికలతో కాలిపొమ్మని, కాలదన్ని నా
కొంప ముంచి, ఒంటరిగా వదిలిపెట్టకు
కోమలమైన నా గుండెకు
కోలుకోలేని కోత పెట్టకు.
కోశాల నిండా ధన రాశులు పోనీ
కోహినూరు కుప్పలెన్ని
కోల్పోయినా కుంగను కానీ,
కొద్దీ సేపు నిన్ను చేరి, నీ
కోసం తపించి, ఏరి
కోరి వరించే, నన్ను
కొంచెం కరుణించు..
కొన ఊపిరి దాకా నిను
కోరుకోడం నేరమైతే నా ఈ
కొదవ జీవితాన్ని ఇదే విరహాన ఏ
కొండ కోనలలోనో, ఓ ‘భోగి ప్రేమన' లా, నేను
కోలు-
-కోనా, ఇక మేను శిధిలమైతే వీడు-
-కోలు పలికైనా ఈ జన్మకు, వేడు-
-కోనా, వేల జన్మలు దాటైనా నీ
కొరకు, మళ్ళీ మానవుడి గా, ఇం-
-కో జన్మ లో , మరో మేనులో మేలు-
-కోనా, ఇదే ప్రేమతో ఎదురు తెన్నులు చూసు-
-కొనుటకు, ఇదే తెలుగులో రాసు-
-కొనుటకు కోట్లకొలది
కొంగొత్త కవితలు
-rn
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి