[A kid before dying in an hospital said this to doctor, “I’m gonna tell everything to the God”]
#PrayingIsntHelping #MournForSyria
సమానత్వాన్నమానుషంగా కాలరాసి పీకనులిమితే,
కుంగి కుమిలిన సౌభ్రాతుత్వం..
వసుధైక కుటుంబాన్ని తలపోసి,
ఆశపడిన వెర్రి బుర్రని,
తన తలని మానవత్వం సమాధి కేసి మోదుకోగా,
కసిగా బాదుకోగా నెత్తి పగిలి, పుర్రె చితికిపోగా,
‘చితి’కిపోకనే కపాలమోక్షం నెత్తుటి మడుగులో జరిగిపోగా..
ఆశ తీరని సౌభ్రాతుత్త్వపు ఆత్మ లేచి, పరమాత్మని చేరి,
ఈ మరుభూమిని ఓసారి చూడమని,
చేతులెత్తి మొక్కి దేవునికి, తనని
దానవుడైన మానవుని ఉనికి లేని,
మరో ప్రపంచపు ఆచూకీ చూపమని..
భేదాల్లేని, ఖేదాల్లేని, విశ్వశాంతికి అవరోధాల్లేని..
ఐకమత్యానికి అందలమేసి అందరు కలిసి
భుజాలు కలిపి, సమసమాజం నిలిపి
మనగల మరో ప్రస్ధానం ఉనికి తెలుపమని,
ఉద్రేకపడి వేడుకొనగా..
ఊ కొడుతూ అటు తిరిగి కూర్చున్న దేవుడి వేదన,
మూగ రోదన చూసి, ఉలిక్కి పడి, వివరమడగగా
ఒడిలో పడున్న పసి బాలుడిని నిమురుతూ ఇలా చెప్పుకున్నాడు,
చేష్టలుడిగిన దేవుడు
‘ అదిగో చూడు.. అదీ పసివాడి దేహం..
అదిగో స్మశానం లానే అగుపించేదే వీడి దేశం..
అక్కడ ఆసుపత్రి లోనే బూడిదవుతున్నది వీడి కాయం..
మనుష్యుడికిచ్చిన జ్ఞానం, నే చేసిన పాపం..
శాంతి పేరున మారణ హోమం, నరక కూపం
చిన్న దేశాల్ని మింగుతున్న పెద్ద దేశాలు…
గుట్టలుగా పడి మండుతున్న శవాల రాశులు
కళ్ళముందే కన్న వాళ్లు కన్నుమూయగా,
గుండె పగిలిన, ఒక్కడె మిగిలిన
ఈ చంటి పిల్లాడు వైద్యుడితో చెప్పి వచ్చాడు..
తన గోడు, దేవుడు వింటాడనుకుని…
కాని, నా సృష్టి నా సృష్టి చేతనే లయం కాబడుతుంటే
నేనెవర్నని శిక్షించుకోను? నన్ను నెను తప్ప?
మనుషులకి అన్నీ ఇచ్చాననుకొంటుంటే,
ఆశని పోషించి, విచక్షణను విసిరికొట్టి, ధర్మాన్ని పాతిపెట్టి
బుద్ధి తో బూడిద పోగేసుకుంటుంటే అది నా తప్పా? ‘
అని కన్నీటి తో ఆ పిల్లడి మోము పై చితా భస్మం కడుగుతూ దేవుడు,
ఎదో చప్పుడయితే పైకి చూసేడు.
సౌభ్రాతుత్త్వపు ఆత్మకున్న ఆఖరి ఆశ కూడా, కరిగి, కాగిపోయి అంతరిక్షం లోకి ఆవిరైంది..
ఆ సగం చచ్చిన ఆత్మ కూడా, దేవుణ్ణి చూసి జాలిపడి, మూగవోయి, రోదిస్తూ రోదసి లో మాయమైంది.
-rn